వాషింగ్టన్ : భారతదేశంలో మత స్వేచ్ఛ దిగజారుతుందని యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ కమిషన్ ఆరోపించింది. ఈ క్రమంలో భారతదేశాన్ని “ప్రత్యేక ఆందోళన కలిగిన దేశం”గా పేర్కొంది. ఈ మేరకు యుఎస్ కమీషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడం (యు.ఎస్.సి.ఐ.ఆర్.ఎఫ్) ఒక నివేదికను విడుదల చేసింది. కొంతమంది ప్రభుత్వ అధికారులు ద్వేషపూరిత ప్రసంగాలతో పాటు తప్పుడు కధనాలు, సమాచారాన్ని ఉపయోగించి భారతదేశంలోని మతపరమైన మైనారిటీలు మరియు వారి ప్రార్థనా స్థలాలపై హింసాత్మక దాడులను ప్రేరేపిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. యు.ఎస్.సి.ఐ.ఆర్.ఎఫ్ తన వార్షిక నివేదికలో.. భారతదేశంలో మతపరమైన స్వేచ్ఛను క్రమబద్ధంగా ఉల్లంఘనలు కొనసాగుతున్నందున “ప్రత్యేక ఆందోళన కలిగిన దేశం”గా గుర్తించాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను విదేశాంగ శాఖ ఇప్పటివరకు ఆమోదించలేదు.2024లో వ్యక్తులు ఎలా చంపబడ్డారు, మూక దాడులు ఎలా జరిగాయి, వ్యక్తుల గృహాలు, ప్రార్ధనా స్థలాలను ఎలా కూల్చారు వంటి వాటిని ఈ నివేదిక వివరించింది. ఈ సంఘటనలు ద్వారా మత స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘించారని యు.ఎస్.సి.ఐ.ఆర్.ఎఫ్ నివేదికలో తెలిపింది. “పౌరసత్వ సవరణ చట్టం (CAA), యూనిఫాం సివిల్ కోడ్ (UCC), అనేక రాష్ట్ర-స్థాయి మతమార్పిడి నిరోధక మరియు గోహత్య చట్టాలతో సహా మతపరమైన మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడానికి, నిరాకరించడానికి భారతదేశం యొక్క చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌లో మార్పులను మరియు అమలును ఇది (నివేదిక) మరింత వివరిస్తుందని యు.ఎస్.సి.ఐ.ఆర్.ఎఫ్ పేర్కొంది.