ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో తాజాగా కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన ఘటన మరోసారి నిరూపించింది.104 ఏళ్ల వయసున్న వృద్ధురాలి వయసును కేవలం నాలుగేళ్లుగా భావించి పింఛన్ నిలిపివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలంలోని జోలదరాశి గ్రామానికి చెందిన ఈ శతాధిక వృద్ధురాలు అధికారులకు మాత్రం నాలుగేళ్ల చిన్నారిలా కనిపించింది. నాలుగేళ్ల పసిపాపకు పింఛనెలా ఇస్తామంటూ అప్పటి వరకు ఉన్న పింఛనును నిలిపివేశారు. పెన్షన్కు ఆమె అర్హురాలు కాదంటూ లబ్ధిదారుల జాబితా నుంచి ఆమె పేరును తొలగించారు. పింఛన్ల రీసర్వేలో చోటుచేసుకున్న వింత ఇది. తన వయసు నాలుగేళ్లుగా చూపించి పింఛను జాబితా నుంచి తన పేరును తొలగించడం అన్యాయమని ఈ శతాధిక వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.