న్యూఢిల్లీ: దేశంలో నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా ఆకాశాన్ని తాకుతున్నాయి. ద్రవ్యోల్బణ ఆధారిత టోకు (హోల్సేల్) ధరల సూచీ జూన్లో 16 నెలల గరిష్ట స్థాయి 3.36 శాతానికి చేరింది. మేలో హోల్సేల్ ద్రవ్యోల్బణ సూచీ 2.61 శాతం, ఏప్రిల్లో 1.26 శాతంగా మాత్రమే నమోదైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సోమవారం ఈ మేరకు వివరాలు విడుదల చేసింది. వరుసగా ఏడు నెలల పాటు తగ్గిన తర్వాత మేలో టోకు ధరల ద్రవ్యోల్బణం పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది.ఆహార వస్తువులు, ఆహార పదార్థాల తయారీ, ముడి పెట్రోలియం, సహజ వాయువు, ఖనిజ చమురులు, ఇతర ఉత్పత్తి వస్తువుల ధరలు పెరగడంతో టోకు ద్రవ్యోల్బణంలో పెరుగుదల కన్పించింది. ఆహార ధరల ద్రవ్యోల్బణ రేటు ఏప్రిల్లో 5.52 శాతం, మేలో 7.40 శాతం ఉండగా జూన్లో 8.7 శాతానికి పెరిగింది. అన్ని ప్రధాన వస్తువులతో పోలిస్తే ఇదే అత్యధికం. ఉత్పత్తి చేసిన వస్తువుల ధరలు కూడా మేతో పోలిస్తే జూన్లో రెట్టింపు అయ్యాయి. మేలో వీటి ధరలు 0.64 శాతం ఉంటే జూన్లో 1.43 శాతానికి చేరాయి. ఆహారధాన్యాలు, వరి, గోధుమ, పప్పులు, కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్లు, మాంసం, చేపలు వంటి ఆహార వస్తువులు సహా ప్రజలకు అవసరమైన వస్తువుల ద్రవ్యోల్బణ రేటు మేలో 7.20 శాతం ఉండగా జూన్ నాటికి 8.80 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో కూరగాయల టోకు ధరల్లో ద్రవ్యోల్బణం కూడా 32.42 శాతం నుంచి 38.76 శాతానికి పెరిగింది. పండ్ల ధరల్లో ద్రవ్యోల్బణం 5.81 శాతం నుంచి 10.14 శాతానికి పెరిగిపోయింది. అయితే ఇంధనం, విద్యుత్కు సంబంధించిన ద్రవ్యోల్బణ రేటు 1.35 శాతం నుంచి 1.03 శాతానికి తగ్గింది.