కోహ్లి ఫొటో వాడినందుకు రూ.10 వేల జరిమానా

కోహ్లి ఫొటో వాడినందుకు రూ.10 వేల జరిమానా

సమాజంలో వివిధ రూపాల్లో చోటుచేసుకుంటున్న మోసాలను గుర్తించడంలో వినియోగదారుల పాత్ర కీలకమైందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి అకున్‌ సబర్వాల్‌ అన్నారు. ప్రముఖుల ఫొటోలు, పేర్లను వారి అనుమతి లేకుండా ప్రచారానికి వినియోగించొద్దని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని శ్రీమాన్‌ ఫ్యాషన్‌ క్లాథింగ్‌ సంస్థ.. ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌కోహ్లి ఫొటోలతో ప్రకటనలు ఇస్తుండటంపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి బి.ఆకాశ్‌కుమార్‌ గతేడాది నవంబరులో తెలంగాణ వినియోగదారుల వ్యవహారాల విభాగం (రిడ్రెసెల్‌ సెల్‌) సలహా కేంద్రంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫొటోలను చూసి వినియోగదారులు కోహ్లి ఈ వ్యాపారానికి ప్రచారకర్తగా ఉన్నారని భావించి, మోసపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. విచారణ చేపట్టిన సలహాకేంద్రం షాపు యాజమాన్యం కోహ్లి అనుమతి లేకుండా ఆయన ఫొటోలతో ప్రచారం చేస్తున్నట్లు గుర్తించి, వారికి రూ.10 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని ఫిర్యాదు చేసిన ఆకాశ్‌కుమార్‌కు ఇవ్వగా.. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తూ, వారి సమస్యలను ఉచితంగా పరిష్కరిస్తున్న సలహా కేంద్రానికే ఈ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆకాశ్‌కుమార్‌ నిర్ణయించుకున్నారు. పౌరసరఫరాల భవన్‌లో మంగళవారం రూ.10 వేల చెక్కును అకున్‌ సబర్వాల్‌కు అందజేశారు. ఈ సందర్భంగా అకున్‌ మాట్లాడుతూ.. ఇలాంటి కేసు తమ విభాగానికి రావడం ఇదే తొలిసారని చెప్పారు. ఆకాశ్‌కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించి, అతడిలాగే ప్రతి ఒక్కరూ మోసాలను గుర్తించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos