ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన 1989 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. ఈ మేరకు నిన్న రాత్రి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విధినిర్వహణలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆధారాలు లభ్యమైనందునే సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. కాగా, గతంలో ఆయన్ను బదిలీ చేసిన ప్రభుత్వం, కొన్నాళ్లు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించామని, అవినీతిపై ఆధారాలు లభ్యమైనందునే సస్పెండ్ చేశామని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో చీఫ్ సెక్రెటరీ నీలం స్వాహ్నీ వెల్లడించారు. చంద్రబాబు హయాంలో ఐబీ విభాగం చీఫ్ గా పనిచేసిన ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయ, ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. వెంకటేశ్వరరావుపై వచ్చిన ఆరోపణలను విచారించిన మీదటే సస్పెండ్ చేసినట్టు పేర్కొన్న ఏపీ ప్రభుత్వం, ఆరోపణల వివరాలను కూడా జీవోలో జత చేసింది. ఆయన అధికారంలో ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్ధ నుంచి నిఘాపరికరాల కొనుగోలు చేశారని, అప్పట్లోనే సదరు సంస్ధతో కుమ్మక్కై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించారని తేలినట్టు పేర్కొంది.ఇజ్రాయెల్ కు చెందిన సంస్థ ఆర్టీ ఇన్ ఫ్లేటబుల్స్ తో చేతులు కలిపి, తన కుమారుడైన చేతన్ సాయికృష్ణ నడిపించే ఆకాశం అడ్వాన్సుడ్ సిస్టమ్స్ కాంట్రాక్టు ఇప్పించుకున్నారని వచ్చిన ఆరోపణలు నిజమయ్యాయని, ఇది అఖిల భారత సర్వీసుల నిబంధనల ఉల్లంఘనని, విదేశీ సంస్ధతో నిఘా సమాచారం పంచుకోవడం ద్వారా జాతీయ భద్రతకు ముప్పు కలిగించారని ప్రభుత్వం ఆరోపించింది. ఇదే సమయంలో నాణ్యతలేని నిఘాపరికరాల కొనుగోలు ద్వారా రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించారని పేర్కొంది. తనపై వేసి సస్పెన్షన్ వేటుపై మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఎ.బి.వెంకటేశ్వరరావు స్పందించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అక్రమాల కారణంగానే తనపై చర్యలు తీసుకున్నారని మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని చెప్పారు. ఈ చర్యతో మానసికంగా తనకు వచ్చిన ఇబ్బంది ఏమీలేదన్నారు. అందువల్ల బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని కోరారు. ప్రభుత్వం తదుపరి చర్య ఏమిటన్నది త్వరలో తెలుస్తుందని, ఈ వ్యవహారంలో తాను చట్టపరంగా ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు.