శ్రీనగర్:కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైనందునే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ లభ్ధి కోసం పాక్ పై వైమానిక మెరుపు దాడులు చేసిందని మ్ము-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్సు పార్టీ అగ్రనేత ఫరూఖ్ అబ్దుల్లా ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడిన సందర్భంగా సోమవారం ఆయన ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. ‘పాకిస్తాన్ పై యుద్ధం లేదా ఘర్షణ ఏదో ఒకటి జరుగుతుందని మాకు ముందే తెలుసు. ఎన్నికల దగ్గర పడినందునే ఈ సర్జికల్ దాడులు చేశారు. దాడుల్లో రూ.కొన్ని కోట్ల విలువైన ఒక యుద్ధ విమానాన్ని పోగొట్టుకున్నాం. దేవుడి దయవల్ల ఐఏఎఫ్ పైలట్ సజీవంగా బయటపడి, పాకిస్తాన్ నుంచి సురక్షితంగా వచ్చాడు’ అని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు జమ్మూ కశ్మీర్ విధానసభ ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. రాజకీయ పక్షాలన్నీ లోక్‌సభ ఎన్నికలతో పాటు విధానసభ ఎన్నికలకు సుముఖంగా ఉన్నా కేవలం లోక్‌సభ ఎన్నికలను మాత్రమే నిర్వహించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ‘జమ్మూ కశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలకు వాతావరణం బాగుంది . విధానసభ ఎన్నికలకు అనుకూలంగా లేదా? స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరగాయి కదా? ప్రస్తుతం ఇక్కడ సరిపడా భద్రతా దళాలు కూడా ఉన్నాయి. అయినా దిగువ సభ ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు?’ అని ప్రశ్నించారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళాలు పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడుల్ని జరిపినట్లు కేంద్ర ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది.