న్యూ ఢిల్లీ : ‘ఢిల్లీ లోకి భారీ సంఖ్యలో ప్రజలు వెళ్లేందుకు అనుమతిస్తే, ఎవరికీ హాని జరగదని, హింస జరగదని ఎవరు హామీ ఇస్తార’ని నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన సాగిస్తున్న రైతులను సుప్రీం కోర్టు గురువారం ప్రశ్నించింది. ‘ప్రజల నియంత్రణ కోర్టుకు సాధ్యం కాదు. ఉద్రేకపూరితమైన గుంపును న్యాయస్థానం అదుపు చేయజాలదు. పోలీసు, నిఘా అధికారులు విచక్షణతో తీసుకోవలసిన నిర్ణయం. ప్రాణాలు, ఆస్తులను ప్రమాదంలోకి నెట్టాలనుకోవడం లేదు. ఇతరుల హక్కులను పోగొట్ట దలచటం లేదు. నగరంలోకి ఎందరిని అనుమ తించాలనే నిర్ణయాన్ని అధికారులే చేయాల’ని పేర్కొంది. పంజాబ్ ప్రభుత్వం తరపున కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం వాదించారు. ‘‘వాళ్ళు గుంపు కాదు, వాళ్ళు రైతులు. అయితే రహదార్లను పోలీసులే అడ్డుకున్నారు. రోడ్లను దిగ్బంధిస్తామని ప్రకటించిన రైతు సంఘం ఏదైనా ఉందా’ని అడిగారు. రైతులు మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. కేంద్రం పట్ల రైతులూ అలాగే అనుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే అన్నారు. చర్చలు జరపడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్న విషయం స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. నిరసనలకు అనుమతించాల భారతీయ కిసాన్ యూనియన్ (భాను) తరపు న్యాయవాది కోరారు. ’మేము స్వతంత్ర వ్యవసాయ నిపుణుల సమితిని ఏర్పాటు చేయదలచాం. అంతవరకూ నిరసనలు కొనసాగ వచ్చు. పోలీసులు ఎటువంటి హింసకు పాల్పడరాదు. రైతులు నగరాన్ని దిగ్బంధించరాదు. చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కు ఉంది. ఈ ప్రాథమిక హక్కుపై ఆంక్షలు విధించేది లేద’న్నారు.