హోసూరు : ఉల్లి ఎగుమతులను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులను కలవరపాటుకు గురి చేస్తోంది. హోసూరు ప్రాంతంలోని ఉల్లి రైతులు అయోమయంలో పడ్డారు. ఈ ప్రాంతంలో సుమారు నాలుగు వేల హెక్టార్లలో మెడిసిన్ ఉల్లిని రైతులు పండిస్తున్నారు. ఇటీవల ఉల్లి పంటకు తెగుళ్లు ఎక్కువగా సోకడంతో దిగుబడి భారీగా తగ్గింది. దిగుబడి తగ్గినా విదేశాలకు ఉల్లి ఎగుమతులు బాగా ఉండడంతో 50 కిలోల బస్తా రూ.1500 వరకు పలికింది. కేంద్ర ప్రభుత్వం అన్నిరకాల ఉల్లి ఎగుమతులను నిషేధిస్తున్నట్లు ప్రకటించడంతో హోసూరు ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే తెగుళ్లు సోకి దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతుండగా, కేంద్రం ఉల్లి ఎగుమతులు నిపివేయడం వల్ల మరింతగా
నష్టాల్లో కూరుకుపోతామని సిద్ధనపల్లి గ్రామానికి చెందిన శివప్ప ఆవేదన వ్యక్తం చేశారు. హోసూరు ప్రాంతంలో వేల హెక్టార్లలో పండించిన ఉల్లిని రోడ్లపై పడేయాల్సిన పరిస్థితి దాపురించిందని రైతులు వాపోయారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేసేందుకు చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే హోసూరు ప్రాంత ఉల్లి రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. సత్వరమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి, తీవ్రంగా నష్టపోతున్న తమను ఆదుకోవాలని ఉల్లి రైతులు కోరారు.