న్యూ ఢిల్లీ : ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఈవీఎంలను వినియోగించరు. ఎన్‌డీఏ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరఫున పి.సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దామాషా ప్రాతినిధ్య ఓటింగ్ జరుగుతున్నందు వల్లే విప్ జారీ చేసే అధికారాన్ని రాజకీయ పార్టీలకు లేదు. ఈ కారణంగానే ఈవిఎంలను ఈ ఎన్నికలో వాడటం లేదు.ఒక ఎంపీ ఒకరికి మించి అభ్యర్థులకు ప్రాధాన్యతా ఓట్లను వేయొచ్చు. అభ్యర్థి పేరు ఎదురుగా ఉండే కాలమ్‌లో ప్రాధాన్యతా అంకెను వేయాలి. బాగా నచ్చిన అభ్యర్థికి 1 అంకెను వేయాలి. తదుపరి ప్రాధాన్యతా స్థానాల్లో ఉండే అభ్యర్థుల పేర్ల ఎదుట 2, 3, 4, 5 ఇలా అంకెలు వేయాలి. ఒక్కో ఎంపీ ప్రాధాన్యత ఒక్కో రకంగా ఉంటుంది. ఈ వైవిధ్యభరిత ప్రాధాన్యతలను నిక్షిప్తం చేసుకొని, ఆయా ప్రాధాన్యతల క్రమంలో ఓట్లను కౌంట్ చేసేలా ఈవీఎంలలో సాఫ్ట్‌వేర్ లేదు. అందుకే వాటిని దామాషా పద్ధతిలో ఓటింగ్ జరిగేే ఎన్నికల్లో వినియోగించరు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో లోక్‌సభ, రాజ్య సభలకు చెందిన మొత్తం 782 ఎంపీలు ఓట్లు వేస్తారు. 543 మంది సభ్యులున్న లోక్‌సభలో ఒక స్థానం ఖాళీగా ఉంది. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో 5 ఖాళీలు ఉన్నాయి.ఈ ఎన్నికలో 782 మంది ఎంపీలు దామాషా ప్రాతినిధ్య పద్ధతిలో ఓట్లు వేయనున్నారు.బ్యాలట్ పేపర్‌లో 2 భాగాలు ఉంటాయి. మొదటి కాలమ్‌లో వరుసగా ఒక దాని కింద మరొకటిగా ఉప రాష్ట్రపతి అభ్యర్థుల పేర్లు ఉంటాయి. దాని పక్కనే రెండో కాలమ్ ఖాళీగా ఉంటుంది.బ్యాలట్ పేపర్‌లోని మొదటి కాలమ్‌లో పేర్లున్న అభ్యర్థులకు ఎంపీలు తమ ప్రాధాన్యత ప్రకారం ఓట్లు వేయొచ్చు. బాగా నచ్చిన ఉప రాష్ట్రపతి అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న రెండో కాలమ్‌లో 1 అంకెను వేయాలి. తదుపరి ప్రాధాన్యత ఇచ్చే అభ్యర్థి పేరు ఎదుటనున్న రెండో కాలమ్‌లో 2 అంకెను వేయాలి. తమకు నచ్చని అభ్యర్థులకు ఎంపీలు చివరి ప్రాధాన్యతను ఇవ్వొచ్చు.ఎంపీలు తమతమ ప్రాధాన్యత ఆధారంగా ఉప రాష్ట్రపతి అభ్యర్థులకు ఓట్లు వేసే వెసులుబాటును పొందుతారు. ఒక ఎంపీకి ఒకే ఓటు ఉంటుంది. కానీ దాన్ని స్వీయ ప్రాధాన్యతా క్రమంలో వ్యక్తం చేసే స్వేచ్ఛ ఎంపీకి లభిస్తుంది. అందుకే దీన్ని దామాషా ప్రాతినిధ్య ఓటింగ్ పద్ధతి అని పిలుస్తారు.బ్యాలట్ పేపర్‌పై ఈ ప్రాధాన్యతా ఓట్లు వేయడానికి ఎన్నికల సంఘం ఇచ్చే పెన్నునే ఎంపీలు వినియోగించాలి.ఎవరైనా ఎంపీ బ్యాలట్ పేపర్‌పై ఉపరాష్ట్రపతి అభ్యర్థుల్లో తన 2వ ప్రాధాన్యత ఎవరు అనేది పొందుపర్చకుంటే, ఆ ఓటును కౌంట్ చేయరు. 2వ ప్రాధాన్యతను సూచించడం వదిలేసి, కేవలం 1, 3, 4, 5 వంటి ప్రాధాన్యతలను బ్యాలట్ పేపర్‌పై పొందుపర్చినా ఆ ఓటు చెల్లదు.