లోక్‌సభ ఎన్నికలకు ముందే తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరనున్నట్లు ప్రకటించగా తాజాగా మరో ఎమ్మెల్యే తెరాసలో చేరనున్నట్లు ప్రకటించాడు.ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై గెలిచిన ఉపేందర్‌రెడ్డి తెరాసలో చేరనున్నట్లు ప్రకటించాడు.దీంతో తెరాసలో చేరడానికి సిద్ధమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ శాసనమండళి పక్షం విషయంలో జరిగిన తీరే పునరావృతమవుతున్నట్లు కనిపిస్తోంది.ఇప్పటికే ఆరు మంది తెరాసలో చేరడానికి సిద్ధమవగా మరో ఎనిమిది మంది తెరాసలో చేరడానికి సిద్ధమైతే శాసనసభ ప్రతిపక్షం తెరాసలో విలీనం కావడం తథ్యం.తాజాగా ఎర్రబెల్లి దయాకరరావు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రాభివృద్ధిని కోరుకునే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నారని త్వరలోనే మరింత మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరనున్నట్లు వ్యాఖ్యానించారు.ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ నుంచి రేగా కాంతారావు,ఆత్రం సక్కు,సబిత ఇంద్రారెడ్డి,హరిప్రియ,చిరుమర్తి లింగయ్య తాజాగా ఉపేందర్‌రెడ్డిలు తెరాసలో చేరనున్నట్లు ప్రకటించగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా తెరాసలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.ఇదే విషయమై శనివారం తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశమై చర్చించనున్నారని త్వరలోనే సుధీర్‌రెడ్డి కూడా తెరాసలో చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి.మరో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తెరాసలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.పరిస్థితి ఇలాగే కొనసాగితే లోక్‌సభ ఎన్నికల్లోపు తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ కావడం తథ్యంగా కనిపిస్తోంది.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు చేజారుతుండడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఆశలు పెట్టుకున్న ఒకటీ రెండు సీట్లు కూడా దక్కవేమోనని కాంగ్రెస్ అధిష్టానం దిగులు చెందుతోంది.ఈ పరిణామాలు కాంగ్రెస్‌ను తీవ్రంగా కలవరపెడుతుండడంతో నష్టనివారణ చర్యలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది..