నాటింగ్‌హామ్ : ఫీల్డింగ్ లోపం వల్లే పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ జట్టు ఓటమి పాలైందని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 14 పరుగులు తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్‌పై భారీ స్కోరు ఖాయమని ముందే తెలుసునని, పాకిస్తాన్ విధించిన లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదని మోర్గాన్ చెప్పాడు. అయితే మ్యాచ్‌పై పట్టు సాధించామనుకుంటున్న తరుణంలో వికెట్లు పోగొట్టుకోవడం ఆశనిపాతంగా మారిందన్నాడు. బ్యాట్‌తోను, బంతితోనూ మంచి ప్రదర్శనే చేసినా, ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలే కొంప ముంచాయని తెలిపాడు. గత మ్యాచుల్లో బ్యాట్ లేదా బాల్‌తో విఫలమైన సందర్భాలున్నాయి కానీ ఫీల్డింగ్‌లో ఎప్పుడూ మెరుగైన ప్రదర్శనే చేశామని వివరించాడు. కాగా పాక్ బ్యాట్స్‌మన్ హఫీజ్ వ్యక్తిగత స్కోరు 14 పరుగులు వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్‌ను జేసన్ రాయ్ నేలపాల్జేశాడు. తర్వాత అతను చెలరేగి 62 బంతుల్లో 84 పరుగులు చేశాడు.