ఆగని ఎన్‌కౌంటర్లు

ఆగని ఎన్‌కౌంటర్లు

రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో భాగంగా వివిధ భద్రతా బలగాలకు చెందిన జాయింట్ టీమ్ అటవీ ప్రాంతంలో సోదాలు జరిపింది. ఆ సమయంలో అబుజ్మద్లోని అడవిలో కాల్పులు చోటుచేసుకున్నాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ”ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం. భద్రతా సిబ్బంది సురక్షితంగా ఉన్నట్టు సమాచారం అందింది” ఆయన చెప్పారు. జిల్లా రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, వివిధ జిల్లాలకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులతో కూడిన ఈ ఆపరేషన్ ఆదివారం ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.తాజా ఘటనతో రాష్ట్రంలో భద్రతా బలగాలతో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో ఈ ఏడాది ఇప్పటివరకు మరణించిన మావోయిస్టుల సంఖ్య 138కి చేరుకున్నది. నారాయణపూర్ సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ డివిజన్లో 136 మంది మావోయిస్టులు హతమయ్యారు. జూన్ 15న నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయి స్టులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్)కి చెందిన ఒక జవాన్ మరణించారు. జూన్ 5న నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు, మే 23న నారాయణపూర్-బీజాపూర్ సరిహద్దులో ఏడుగురు హతమయ్యారు. మే 10న బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో కనీసం 12 మంది మావోయిస్టులు మరణించగా, ఏప్రిల్ 30న నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులో ముగ్గురు మహిళలతో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ 16న కంకేర్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం 29 మంది మావోయిస్టులు హతమయ్యారని అధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos