కోజికోడ్: కోయిలాండిలోని కురువంగడ్‌లో గల మనక్కులంగార ఆలయ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఉత్సవాల కోసం తీసుకొచ్చిన రెండు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయ పడ్డారు. ఉత్సవాలు జరుగుతుండగా.. ఉన్నట్టుండి పీతాంబరన్, గోకుల్ అనే రెండు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పెద్ద పెద్దగా శబ్ధాలు చేస్తూ.. గందరగోళం సృష్టించాయి. ఈ ఘటనతో ఉత్సవాలకు వచ్చిన భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు లీల (68), రాజన్ (66), అమ్ముకుట్టి (65) ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 36 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 21 మందిని కోయిలాండి తాలూకా ఆసుపత్రికి తరలించగా.. మరో 14 మందిని కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.