న్యూ ఢిల్లీ: దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ లో జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరం, రాజస్థాన్ లకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు కొనసాగే ఛాన్స్ ఉందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ఆ రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్ 8 – 10 మధ్యలో ప్రకటించే అవకాశం ఉంది. 2018లో వీటికి చివరి సారిగా ఎన్నికలు జరిగాయి. సరిగ్గా 5 ఏళ్ల తరువాత 2023 ఏడాది చివర్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆపద్ధర్మంగా మారనున్నాయి. రాజస్థాన్, మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్ లకు ఒకే సారి పోలింగ్ నిర్వహించి, ఛత్తీస్ గఢ్ కి రెండు విడతల్లో పోలింగ్ జరపనున్నట్లు సమాచారం. తెలంగాణ , రాజస్థాన్, ఛత్తీస్గఢ్ శాసనసభల పదవీకాలం వచ్చే ఏడాది జనవరిలో ముగుస్తుంది. మిజోరాం శాసన సభ పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 17తో ముగుస్తుంది.