199 సార్లు పోటీ..ఒక్కసారి కూడా గెలవలేదు..

199 సార్లు పోటీ..ఒక్కసారి కూడా గెలవలేదు..

భూమ్మీద పుట్టిన ప్రతీ మనిషికి ఒక్కో అభిరుచి,ఆశ,లక్ష్యం ఉంటాయి.సినిమాల్లో ఎదగాలనో, వ్యాపారవేత్తగా రాణించాలనో,అత్యున్నత అధికారిగా దేశ సేవ చేయాలనో లేదా క్రీడాకారుడిగా పేరుప్రఖ్యాతులు సాధించాలనో ఇలా ప్రతీ ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది.అయితే రాష్ట్రంతో, పార్టీలతో, అభ్యర్థులతో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకున్న వ్యక్తిని ఎప్పుడైనా చూశారా.అటువంటి వ్యక్తిని చూడాలంటే తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా కుంజాండయార్‌కు వెళ్లాల్సిందే.అదేంటో తెలుసుకుందాం పదండి..కుంజాండియార్‌ ప్రాంతానికి చెందిన పద్మరాజన్‌ టైర్ల వ్యాపారం చేస్తుంటారు.అయితే చిన్నప్పటి నుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కలలు కన్న పద్మరాజన్‌ అందుకు ఎన్నికలను మార్గంగా ఎంచుకున్నాడు.

అంతే రాష్ట్రాలు,ఎన్నికలు,అభ్యర్థులు,పార్టీలతో సంబంధం లేకుండా ఎక్కడపడితే అక్కడ పోటీ చేయడం ప్రారంభించాడు.1986 నుంచి పోటీ చేయడం మొదలుపెట్టిన పద్మరాజన్‌ ఇప్పటి వరకు 199 సార్లు పలు ఎన్నికల్లో పోటీ చేశాడు.త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా 200 సార్లు పోటీ చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించబోతున్నాడు.ఎన్నికలు రాగానే నామినేషన్‌ వేయడం,పోటీ చేయడం, ఓడిపోవడం మళ్లీ పోటీ చేయడం పద్మరాజన్‌ను సాధారణమయింది.ఇప్పటి వరకు ఎన్నోసార్లు డిపాజిట్లు కూడా దక్కనంత ఘోరంగా ఓడినా లెక్క చేయని పద్మరాజన్‌ ఎన్నికల్లో పోటీ చేయడంపైనే దృష్టి సారిస్తాడు.తమిళనాడు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌,కేరళ,ఢిల్లీ,కర్ణాటక తదితర రాష్ట్రాల ఎన్నికల్లో కూడా పద్మరాజన్‌ పోటీ చేశాడు.1991లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల నియోజకవర్గం నుంచి దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు పోటీ స్వతంత్య్ర అభ్యర్థిగా పద్మరాజన్‌ పోటీ చేశాడు.ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పద్మరాజన్‌ను అపహరించడంతో ఫేమస్‌ అయ్యాడు.ఇదొక్కటే కాదు ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నుంచి దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పెయిపై కూడా పద్మరాజన్‌ పోటీ చేశాడు.

ఇప్పటి వరకు నలుగురు ప్రధానులు,11 మంది ముఖ్యమంత్రులపై పోటీ చేసిన పద్మరాజన్‌ ఇప్పటికే లిమ్కా బుక్‌ రికార్డ్స్‌లో ఎక్కారు.2014లో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేయడానికి నామినేషన్‌ దాఖలు చేయగా సరైన వివరాలు అందించలేదనే కారణంతో ఎన్నికల అధికారులు పద్మరాజన్‌ నామినేషన్‌ తిరస్కరించడంతో ప్రధాని మోదీ పద్మారాజన్‌ గురి నుంచి తప్పించుకున్నారు.2011లో తమిళనాడులోని మెట్టూరు శాసనసభ స్థానం నుంచి పోటీ చేయగా పద్మరాజన్‌కు ఆరువేలకు పైగా ఓట్ల దక్కాయి.ఇన్ని ఓట్లు పద్మరాజన్‌కు అప్పటి వరకు ఏఒక్క ఎన్నికల్లో దక్కకపోవడం విశేషం.తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్‌ దాఖలు చేసి 200 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన ఏకైక వ్యక్తిగా పద్మరాజన్‌ రికార్డు సృష్టించారు.ఎక్కువసార్లు పోటీ చేయడం,డిపాజిట్లు కూడా దక్కకుండా ఓడిపోవడం కూడా పద్మరాజన్‌కు రికార్డులు తెచ్చిపెట్టాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos