దేశవ్యాప్తంగా కలకలం రేపిన తబ్లిగీ జమాత్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఏక కాలంలో దాడులు చేసింది. ముంబై, ఢిల్లీ, కేరళతోపాటు హైదరాబాద్ మల్లేపల్లితోపాటు పాతబస్తీలోని మరో మూడు తబ్లిగీ జమాత్ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరిపింది.ప్రపంచ దేశాల నుంచి తబ్లీగీ జమాత్ కు పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయన్న ఆరోపణతో పాటు.. అలా వచ్చిన నిధుల్ని నిబంధనలకు విరుద్దంగా సొంత ఖాతాలకు తరలించిన వైనాన్ని ఈడీ గుర్తించింది. దీంతో.. మర్కజ్ చీఫ్ మౌలానా సాద్ తో పాటు.. మరో నలుగురిపైనా కేసు నమోదు చేశారు. మనీ లాండరింగ్ తో పాటు.. హవాలా ద్వారా డబ్బుల లావాదేవీలు జరిగినట్లుగా చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న కార్యాలయాలతో పాటు.. హైదరాబాద్ లోని నాలుగు చోట్ల సోదాలు నిర్వహించినట్లు చెబుతున్నారు. ఈ తనిఖీల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి.. వీటిల్లో ఏమేం అంశాల్ని గుర్తించారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.కరోనా కేసులు అప్పుడప్పుడే దేశంలో నమోదవుతున్న వేళ.. తబ్లీగీ జమాతే సంస్థ నిర్వహించిన సదస్సు కారణంగా.. భారీ ఎత్తున కరోనా కేసులు దేశ వ్యాప్తంగా వ్యాపించటం తెలిసిందే.తబ్లీగీల ఎపిసోడ్ లేకుంటే.. కరోనా వ్యాప్తి చాలా తక్కువగా ఉందన్న మాట ఇప్పటికి వినిపిస్తూ ఉంటుంది.