కోలకతా:పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం సంచలనం రేపుతున్న వేళ, అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే జీబన్ కృష్ణ సాహాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. ముర్షిదాబాద్ జిల్లాలోని ఆయన నివాసంలో సోదాలు జరుగుతుండగా, అధికారుల నుంచి తప్పించుకునేందుకు ఆయన గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేయడం కలకలం సృష్టించింది. టీచర్ల నియామకాల్లో జరిగిన అవినీతికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో భాగంగా బర్వాన్ నియోజకవర్గ ఎమ్మెల్యే జీబన్ కృష్ణ సాహా నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో సాహా తన మొబైల్ ఫోన్లను ఇంటి వెనుక ఉన్న మురుగు కాలువలో పడేసి, గోడ దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన ఈడీ, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాలువ నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తడిసిన దుస్తులతో ఉన్న ఎమ్మెల్యేను అధికారులు అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.విచారణకు సహకరించకపోవడంతో మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద సాహాను అరెస్ట్ చేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఆయనతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఇదే కేసులో జీబన్ కృష్ణ సాహాను 2023లో సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆయన విడుదలయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో గ్రూప్ ‘సి’, ‘డి’ సిబ్బందితో పాటు ఉపాధ్యాయుల నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. కలకత్తా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ కేసుపై దర్యాప్తు చేస్తోంది. ఈ కుంభకోణంలో ఇప్పటికే రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ, టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య వంటి పలువురు కీలక వ్యక్తులను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు నాలుగు ఛార్జిషీట్లు దాఖలు చేసింది.