అమరావతి : ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు భయాందోళనలకు గురిచేశాయి. గురువారం మధ్యాహ్నం జిల్లాలోని రేపాయి, ముండ్లమూరు మండలంలోని గ్రామాల్లో సెకన్ పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గత నెల ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలంలో గత నెల 21,22వ తేదీల్లో వరుసగా ఉదయం 10.35 నుంచి 10.40 గంటల మధ్య కొన్ని క్షణాలపాటు రెండురోజులు భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు లోనయ్యారు. ముండ్లమూరు, శింగన్నపాలెం, వేంపాటు, పెద్దఉల్లగల్లు, పసుపుగల్లు గ్రామాల్లో భూమి కంపించిందని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా గురువారం కూడా ఇదే మండలంలోని పలు గ్రామాల్లో భూమి కంపించడం ఆందోళనకు గురి చేస్తుందని గ్రామస్థులు పేర్కొన్నారు.