ఎటూ తేల్చని దుష్యంత్

ఎటూ తేల్చని దుష్యంత్

చండీగఢ్ : కాంగ్రెస్, భాజపా రెండూ తమకేమీ అంటరానివి కావని జననాయక్ జనతా పార్టీ అధ్యక్షుడు (జేజేపీ) దుష్యంత్ చౌతాలా స్పష్టం చేశారు. ప్రభుత్వంలో చేరడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. తామింకా ఏ పార్టీతోనూ చర్చలు జరపలేదన్నారు. ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. శుక్రవారం జేజేపీ శాసనసభా పక్ష సమావేశం జరిగిందన్నారు. తనను పార్టీ నేతగా ఎన్నుకుంటూ తీర్మానం చేసినట్టు వెల్లడించారు. తమ విధానాలను గౌరవిస్తూ, తాము ప్రతిపాదించే కనీస ఉమ్మడి కార్యక్రమానికి ఎవరు మద్దతిస్తే వారికే మద్దతునిస్తామని స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్లు, వృద్ధులకు పింఛన్లు తదితర అంశాలు తమ కనీస ఉమ్మడి కార్యక్రమంలో ఉన్నాయన్నారు. ఈ సమావేశానికి ముందు దుష్యంత్ తిహార్ జైలులో ఉన్న తన తండ్రి అజయ్ చౌతాలను కూడా కలిశారు. హరియాణా ప్రజలు మార్పును కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మరో వైపు హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత వీడలేదు. ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు జాప్యమయ్యేట్లు ఉంది. మొత్తం 90 స్థానాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్థానాలు అవసరం. భాజపా 40, కాంగ్రెస్ 31, జేజేపీ 10, ఇతరులు 9 స్థానాల్లో గెలుపొందారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్థానాలు కాంగ్రెస్, భాజపాకు రాకపోవడంతో జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా కింగ్ మేకర్‌గా అవతరించారు. అధికారానికి కేవలం ఆరుగురి మద్దతే అవసరం ఉన్న భాజపా స్వతంత్రుల మద్దతును కూడగట్టే పనిలో నిమగ్నమైంది. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసి మరోసారి హరియాణా పీఠం దక్కించుకొనే దిశగా పావులు కదుపుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాకే ఎక్కువ అవకాశాలున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos