పాకిస్తాన్ ఇంకా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. చాటు మాటుగా భారత్‌లో చొరబాటుకు ప్రయత్నిస్తూనే ఉంది. తాజాగా భారత్ భూభాగంలోకి రావడానికి పాకిస్తాన్ డ్రోన్ చేసిన ప్రయత్నాన్ని బీఎస్ఎఫ్ దళాలు వమ్ము చేశాయి. రాజస్తాన్ సమీపంలో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. డ్రోన్ వస్తున్న విషయాన్ని పసిగట్టిన దళాలు వెంటనే కాల్పులు జరపడంతో అది తిరిగి పాక్ వైపు వెళ్లిపోయింది. శ్రీగంగానగర్ సమీపంలోని హిందూమల్కోట్ ప్రాంతంలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్‌లోకి రావడానికి డ్రోన్ ప్రయత్నించిందని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ లక్ష్యిత దాడుల అనంతరం పాక్ డ్రోన్ ఒకటి గుజరాత్‌లోని కచ్ సరిహద్దు వెంబడి ఉన్న నలియా స్థావరం సమీపంలోకి రాగా సైన్యం దానిని కూల్చివేసింది. ఈ నెల నాలుగున రాజస్తాన్‌లోని బికనీర్ సెక్టార్‌లో కూడా ఇలాంటి ప్రయత్నమే జరిగింది. భద్రతా బలగాలు ఆ డ్రోన్‌ను సుఖోయ్-30 యుద్ధ విమానంతో కూల్చివేశాయి.