పుతిన్, కిమ్‌తో జిన్‌పింగ్ భేటీ.. అమెరికాపై కుట్ర

పుతిన్, కిమ్‌తో జిన్‌పింగ్ భేటీ.. అమెరికాపై కుట్ర

వాషింగ్టన్‌:చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌లతో కలిసి జిన్‌పింగ్ అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. చైనా నిర్వహించిన భారీ సైనిక పరేడ్‌కు పుతిన్, కిమ్ హాజరుకావడంపై ట్రంప్ మండిపడ్డారు.బుధవారం ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. “అమెరికాకు వ్యతిరేకంగా మీరు కుట్ర పన్నుతున్నప్పుడు, వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జోంగ్ ఉన్‌లకు దయచేసి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయండి” అని ఆయన వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో చైనా స్వాతంత్ర్యం కోసం అమెరికా సైనికులు తమ రక్తాన్ని ధారపోశారని, ఆ త్యాగాలను జిన్‌పింగ్ ప్రభుత్వం గౌరవిస్తుందో లేదో చూడాలని ప్రశ్నించారు. చైనా విజయం కోసం ఎందరో అమెరికన్లు ప్రాణాలర్పించారని, వారి ధైర్యసాహసాలను, త్యాగాలను చైనా గుర్తుంచుకోవాలని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా బుధవారం భారీ సైనిక కవాతును నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నేత కిమ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ పరేడ్‌లో భూమి, గాలి, సముద్ర మార్గాల ద్వారా ప్రయోగించే వ్యూహాత్మక ఆయుధాలు, అత్యాధునిక డ్రోన్లు, యుద్ధ విమానాలను తొలిసారిగా ప్రదర్శించినట్లు చైనా సైనిక అధికారులు తెలిపారు. 2019 తర్వాత చైనాలో ఇంత పెద్ద సైనిక పరేడ్ జరగడం ఇదే మొదటిసారి.ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మాట్లాడుతూ.. చైనా ప్రగతిని ఎవరూ ఆపలేరని, తమ దేశం శాంతియుత అభివృద్ధి మార్గానికే కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రపంచం శాంతి లేదా యుద్ధం అనే కీలకమైన దశలో ఉందని, మానవాళి పురోగతి వైపు చైనా నిలుస్తుందని ఆయన అన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను కాపాడేందుకు చైనా సైన్యం (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) ప్రపంచస్థాయి శక్తిగా ఎదగాలని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos