పెంపుడు కుక్క తన యజమాని పట్ల ఎంత విశ్వాసంగా ఉంటుందో రుజువు చేసే మరో సంఘటన ఇది. ఒడిశాలోని ఖుర్దా జిల్లా జట్నీలో చోటు చేసుకుందీ సంఘటన. అమన్ షరీఫ్ అనే వ్యక్తి వద్ద ఓ డాల్మేషన్ ఉంది. దానికి అతను ముద్దుగా టైసన్ అని పేరు పెట్టుకున్నాడు. మూడు రోజుల కిందట రాత్రి పూట టైసన్ అరుపులు విన్న అమన్ తలుపులు తెరుచుకుని బయటకు వచ్చి చూశాడు. అక్కడి దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. ఓ తాచు పాము ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా, టైసన్ దానిని నిలువరించే ప్రయత్నంలో పోరాడుతూ ఉంది. ఎంతకూ పాము వెనక్కు మళ్లకపోవడంతో, దానిని చంపేసి స్పృహ తప్పి పడిపోయింది. రాత్రి వేళ కావడంతో టైసన్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లడం సాధ్యం కాలేదు. ప్రైవేట్ వెటర్నరీ వైద్యులను ఫోనులో సంప్రదించడానికి అతను చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి టైసన్ చనిపోయింది. దాని ముఖం, తోక మీద పాము గాట్లు ఉన్నాయి. సరైన సమయానికి వైద్యం అంది ఉంటే తన టైసన్ బతికి ఉండేదని అమన్ కన్నీటి పర్యంతమవుతున్నాడు.