న్యూ ఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో వైద్యులపై జరిగిన దాడులకు నిరసనగా దేశ వ్యాప్తంగా వైద్యుల ఆందోళలను కొనసాగుతున్నాయి. దీంతో రోగులు సతమతమవుతున్నారు.హైదరాబాద్లోని నిమ్స్లో వైద్యులు ఓపీ సేవలను నిలిపివేసారు. దిల్లీలోని ఎయిమ్స్లో వైద్యులు నినదిస్తూ రోడ్ల పైకి వచ్చారు. తొలుత వీరు సమ్మె చేయడానికి నిరాకరించారు. ఆతర్వాత సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలను నిలిపి వేసినట్లు ప్రకటించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు వడోదరలోని సర్ సయాజీ రావు జనరల్ ఆసుపత్రిలోని వైద్యులు ఓపీ విభాగంలో నిరసనలు చేపట్టారు. వైద్యుల రక్షణకు చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అసోంలోని వైద్యులు కూడా 24 గంటల పాటు వైద్య సేవలను నిలిపి వేసినట్లు ప్రకటించారు. అత్యవసరమైన రోగులకు మాత్రమే సేవలందిస్తామని తెలిపారు. కేరళలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను మూసివేశారు. కొందరు ప్రభుత్వ వైద్యులు మాత్రమే ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సేవలందిస్తున్నారని ఆ రాష్ట్ర వైద్యుల సంఘం తెలిపింది. పుదుచ్చేరి ఇందిరాగాంధీ జనరల్ హస్పిటల్, రీసెర్చి ఇన్స్టిట్యూట్ వైద్యులు గంట పాటు సమ్మె చేసారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఆసుపత్రి యాజమాన్యంపై, వైద్యులపై దాడి చేసిన నిందితులకు కనీసం ఏడేళ్లు శిక్ష పడేలా చట్టాన్ని సత్వరమే సవరించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అవసరమైతే వారిని పోక్సో చట్ట పరిథిలోని తీసుకురావాలని కోరింది. ఆసుపత్రులను ప్రభుత్వం తమ పరిథిలోకి తీసుకుని భద్రత కల్పించాలని పేర్కొంది.