హోసూరు : హోసూరు యూనియన్లోని 26 పంచాయతీలలో పని చేస్తూన్న కార్యదర్శులదే ఇష్టారాజ్యంగా మారిందని డీఎంకే పార్టీ కౌన్సిలర్లు దుయ్యబట్టారు. శుక్రవారం హోసూరు యూనియన్ కార్యాలయంలో యూనియన్ కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు. హోసూరు యూనియన్ చైర్‌పర్సన్ శశి వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏడీఎంకే కౌన్సిలర్లతో పాటు డీఎంకే పార్టీకి చెందిన 7 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు. హోసూరు యూనియన్ అభివృద్ధిపై సమావేశంలో చర్చించారు. యూనియన్ లోని అన్ని పంచాయతీలలో అధ్యక్షుల కన్నా కార్యదర్శులదే హవా కొనసాగు తోందని, దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతుందని డీఎంకే పార్టీ కౌన్సిలర్ సంపత్ ధ్వజమెత్తారు. పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులు తమ దృష్టికి తీసుకు రావడం లేదని, దీనిపై చైర్‌పర్సన్ స్పందించి సమాధానం ఇవ్వాలని సంపత్ డిమాండ్ చేశారు. మరో కౌన్సిలర్ రమేష్ మాట్లాడుతూ యూనియన్ లోని అన్ని పంచాయతీ లో పని చేస్తున్న క్లర్కులు తమ విధులను మరచి ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. పంచాయతీలలో క్లర్కు లను కట్టడి చేసే బాధ్యత చైర్‌పర్సన్, అధికారులమీదే ఉందని డీఎంకే పార్టీ కౌన్సిలర్లు గుర్తు చేశారు. పంచాయతీ అధ్యక్షులు, అధికారులు పట్టించుకోకపోవడంతో పంచాయతీ పరిధిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనికి సమాధానం చెప్పి తీరాలని డీఎంకే పార్టీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. రానురాను యూనియన్ లో అభివృద్ధి పనులు కుంటు పడుతున్నాయని వారు ఆరోపించారు. తాము లేవనెత్తిన అంశాలపై యూనియన్ చైర్ పర్సన్ సరైన సమాధానం ఇవ్వలేదని ఆరోపిస్తూ డీఎంకే పార్టీ కౌన్సిలర్లు సమావేశం నుండి వాకౌట్ చేశారు.