న్యూఢిల్లీ: డీఎంకే ఎంపీ టీఆర్ బాలు మంగళవారం లోక్సభలో కేంద్ర మంత్రి మురుగన్ అసమర్థ ఎంపీ అని వ్యాఖ్యానించారు. తమిళనాడు వరదలకు సంబంధించిన ప్రశ్నపై చర్చ జరుగుతున్న సమయంలో ఎంపీ టీఆర్ బాలు మాట్లాడారు. ఆయన వేసిన అనుబంధ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వడానికి నిరాకరించింది. ఆ సమయంలో కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ సంబంధం లేని ప్రశ్న వేస్తున్నారని ఆరోపించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రికి క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. అయినా కానీ బాలూ తన వ్యాఖ్యలను ఉపసంహరించలేదు. దళిత మంత్రిని అవమానించినట్లు బీజేపీ ఆరోపించింది. చివరకు స్పీకర్ ఓం బిర్లా ఆ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించారు. డీఎంకేతో పాటు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.