కేంద్రంపై పోరుకు సిద్ధమవుతున్న డిఎంకె

కేంద్రంపై పోరుకు సిద్ధమవుతున్న డిఎంకె

చెన్నై : తమిళనాడు రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో మొండిచేయి చూపడాన్ని నిరసిస్తూ పార్లమెంట్లోనూ, ఢిల్లీలోనూ ఆందోళన నిర్వహించేందుకు డిఎంకె సిద్ధమవుతోంది. నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్లో నిరసన తెలపాలని నిర్ణయించింది. తమిళ భాషకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడాన్ని డిఎంకె వ్యతిరేకిస్తోంది. 2024-25 మధ్యంతర బడ్జెట్లో తమిళనాడు పట్ల వివక్ష చూపడాన్ని నిరసిస్తూ చేపట్టనున్న ఈ ఆందోళనలలో డిఎంకెతో పాటు తమిళనాడులోని ఆ పార్టీ మిత్ర పక్షాలు కూడా పాల్గొంటాయి. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించనున్నట్లు పార్టీ నేత టిఆర్ బాలు ఒక ప్రకటనలో తెలిపారు. తమిళనాడు రాష్ట్రానికి నిధులు కేటాయించడం లేదని, తగిన సహాయం అందించడం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్ విమర్శించిన కొద్ది రోజులకే ఈమేరకు నిర్ణయించారు. డిసెంబరులో కురిసిన వర్షాల కారణంగా అతలాకుతలమైన ఎనిమిది జిల్లాల్లో సహాయక చర్యల కోసం రూ.37,000 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసినా, కేంద్రం పట్టించుకోలేదు. నిధులు విడుదల చేయకపోవడంతోపాటు గవర్నర్ ద్వారా రాష్ట్రంలో పాలనను అడ్డుకునే చర్యలను నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహించనున్నట్లు ఇప్పటికే కేరళ ప్రభుత్వంప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం కూడా ఢిల్లీలో ఆందోళనకు సన్నద్ధమవుతోంది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఆందోళన చేయాలని నిర్ణయించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos