రైతు నేత జగ్జీత్‌సింగ్‌ దల్లేవాల్‌ను ఆసుపత్రికి తరలింపు

రైతు నేత జగ్జీత్‌సింగ్‌ దల్లేవాల్‌ను ఆసుపత్రికి తరలింపు

జలంధర్‌ : రైతు ఆందోళనల నేపథ్యంలో రైతు నేత జగ్జీత్‌సింగ్‌ దల్లేవాల్‌ను జలంధర్‌లోని పిమ్స్‌ (పంజాబ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)కి పంజాబ్‌ పోలీసులు తరలించారు. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆసుపత్రి వెలుపల భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. బుధవారం రైతులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం నిరసన బాట పట్టారు. శంభు, ఖనౌరీ సరిహద్దుల్లో నిరసనలు చేపట్టిన రైతులను పోలీసులు బలవంతంగా తరలించడాన్ని బికెయు (భారతీయ కిసాన్‌ యూనియన్‌) రైతు సంఘం నేత రాకేష్‌ టికాయత్‌ ఖండించారు. ఒకవైపు రైతు డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చలు జరుపుతోంది. మరోవైపు నిరసన చేస్తున్న రైతుల్ని అరెస్టు చేస్తోంది. ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఆయన ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ స్పందించారు. కుట్రలో భాగంగానే రైతులపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. పంజాబ్‌ మాత్రమే కాదు.. మొత్తం రైతు సమాజం నేడు పెద్ద దాడిని ఎదుర్కొంటోంది. ఈరోజు చండీగఢ్‌లో ఒక సమావేశం జరిగింది. తదుపరి చర్చలు మే 4న నిర్వహించాలని నిర్ణయించారు. కానీ రైతులను వెనుక నుంచి మోసం చేస్తున్నారు. రైతులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరసన చేస్తోంటే, ప్రభుత్వమే రోడ్లను నిర్బంధిస్తోందన్నారు. మరోసారి దేశ రాజధానికి తరలిరావాలని రైతులు భావిస్తున్నారని చన్నీ అన్నారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో గురువారం శంభు సరిహద్దు వద్ద భద్రతను పెంచారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos