బధాయా : ‘ప్రతిసారీ నేను స్త్రీలకు ఒకటే చెబుతున్నా. ఎలాంటి పరిస్థితుల్లోనూ అనసర సమయాల్లో బయటకు వెళ్లకండి’ అంటూ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు చంద్రముఖి దేవి చేసిన వ్యాఖ్యాలు వివాదాస్పదమయ్యాయి. ఉత్తరప్రదేశ్లో 50 ఏళ్ల మహిళపై జరిగిన హత్యాచార ఘటనపై విచారణ జరిపేందుకు వచ్చిన ఆమె బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. ‘ఈ కేసులో పోలీసుల స్పందన సరిగా లేదు. బాధిత మహిళ ఆ సాయంత్రం బయటకు పోకుండా ఉన్నా, లేదా కుటుంబంలో ఎవరినో ఒకరిని తోడుగా తీసుకెళ్లినా ఈ సంఘటన జరిగేది కాదు. ఆమెకు వచ్చిన ఫోన్కాల్ బట్టి అత్యాచార సంఘటన ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగింది. అలాగే పోలీసులు వెంటనే స్పందించి ఉంటే ఆమె ప్రాణాలతో బతికేది’ అన్నారు. 50 ఏళ్ల అంగన్వాడీ కార్యకర్త వారి నివాసానికి దగ్గరలో గుడిలో హత్యా చారానికి గురైంది.ఈ ఘటనకు గుడి పూజారి, అతనిసహాయకులే కారణమని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పూజారి పరారీలో ఉన్నారు. దేవి చేసిన వ్యాఖ్య లు చర్చకు దారి తీసాయి. ‘ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఎంతవరకూ సమంజసమ’ని ప్రశ్నించారు.