న్యూఢిల్లీ: కోవిడ్ బాధిత కుటుంబాలకు చేయూత నివ్వనున్నట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. శుక్రవారం వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఢిల్లీలో కరోనా తాజా కేసుల సంఖ్య 8,500కు తగ్గింది. పాజిటివిటీ రేటు సుమారు 12 శాతానికి దిగింది.కరోనాతో పోరాటం ముగిసిపోలేదు. అలసత్యానికి తావీయం.అనేక మంది పిల్లలు తమ తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయిన విషయం నాకు తెలుసు. వారికి నేను చెప్పదలచుకున్నది ఒకటే. వారి కోసం నేను ఇంకా ఉన్నాను. ఎవరూ అనాథలు కాదు. ఆ విధంగా అనుకోవద్దు. మీ చదువులు, వృద్ధిలో రావడానికి అవసరమైన జాగ్రత్తలన్నీ ప్రభుత్వం తీసుకుంటుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తులను కోల్పోయిన పెద్దవాళ్లూ ఉన్నారు. వాళ్లు సంపాదించే పిల్లలమీదే ఆధార పడి ఉంటారు. వాళ్లకి ఈ కొడుకు కేజ్రీవాల్ ఉన్నాడు. ప్రభుత్వ పరంగా వారిని ఆదుకుంటా’మని కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు. ‘కరోనా పేషెంట్ల కోసం గత పది రోజులుగా సుమారు 3,000 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఐసీయూ పడకలు మాత్రం లేవు. మరో 1,2000 ఐసీయూ పడకలు, మరిన్ని ఆక్సిజన్ పడకల ఏర్పాటు, ఆక్సిజన్ సిలెండర్ల సేకరణ జరుగుతోంది. కరోనా కేసుల సంఖ్య సున్నాకు చేరేంత వరకూ విశ్రమించేది లేదు. లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తామ’ని వివరించారు.