విజయవాడ : రాజధానిపై శుక్రవారం జరిగే మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఆలోచన తమకు లేదని చెప్పారు. మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో కలిసి విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి అంశంలోనూ బాధ్యతగా పనిచేస్తున్నామని చెప్పారు. తెదేపా ప్రభుత్వం చేసినట్లు ఇన్సైడర్ ట్రేడింగ్ చేయబోమని, గ్రాఫిక్స్, సినిమాలు చూపించబోమని, అన్నీ వాస్తవాలే చెబుతామని వివరించారు. అమరావతిలో 50 శాతం నిర్మాణాలు దాటిన భవనాలను పూర్తి చేస్తామన్నారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల సమస్యలు పరిష్కరిస్తాంమని అంటూ రైతులకు ఎలాంటి భయాందోళన అక్కర్లేదని భరోసా ఇచ్చారు. రైతుల నుంచి సేకరించిన 33 వేల ఎకరాలను ఏం చేస్తామో త్వరలో చెబుతామన్నారు. ఐదేళ్లు సీఎంగా ఉండి కూడా చంద్రబాబు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటని ప్రశ్నించారు.