న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ అప్పులు కుప్పగా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.200.16 లక్షల కోట్లకు అప్పు పెరగనుంది. ఇది జిడిపిలో 56.1 శాతంగా నమోదైంది. సోమవారం లోక్‌సభలో సిపిఐ ఎంపి కె సుబ్బరాయన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అప్పులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 2018-19లో రూ.93.26 లక్షల కోట్ల ఉన్న కేంద్ర ప్రభుత్వ అప్పు, 2025-26 నాటికి రూ.200.16 లక్షల కోట్లకు పెరగనుందని పేర్కొన్నారు.
పెరుగుతున్న కుటుంబ అప్పు.. తగ్గుతున్న పొదుపు
దేశంలో కుటుంబాల అప్పు పెరుగుతుంది. మరోవైపు కుటుంబాల పొదుపు తగ్గుతుంది. లోక్‌సభలో ఎంపి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. తలసరి ఒక కుటుంబ అప్పు 2019లో రూ.46,898 ఉండగా, 2024 నాటికి రూ.86,713 పెరిగింది. ప్రతియేడాది కుటుంబాల అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు కుటుంబాల పొదుపు 2020-21లో జిడిపిలో 22.7 శాతం కాగా, 2022-23 నాటికి 18.4 శాతానికి తగ్గింది. అన్ని రాష్ట్రాల అప్పులు పెరుగుతున్నాయి. లోక్‌సభలో కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అప్పులు 2016లో జిడిపిలో 23.7 శాతం కాగా, 2025 నాటికి 28.8 శాతానికి పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో అప్పు 2016లో జిఎస్‌డిపిలో 24.5 శాతం కాగా, 2025 నాటికి జిఎస్‌డిపిలో 34.7 శాతానికి పెరిగింది. అలాగే తెలంగాణ అప్పు 2016లో జిఎస్‌డిపిలో 15.7 శాతం కాగా, 2025 నాటికి జిఎస్‌డిపిలో 26.2 శాతానికి పెరిగింది.