ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరిచేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లోక్ సభలో కేశినేని నాని మాట్లాడారు. ప్రశ్నోత్తరాలు కొనసాగుతోన్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ… ప్రాంతీయ భాషల పరిరక్షణకు కేంద్రం ఏమేం చర్యలు తీసుకుంటోందో వివరించాలని ఆయన ప్రశ్నించారు.ప్రాంతీయ భాషలను రక్షించాల్సిన అవసరం ఉందని, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఏపీ సర్కారు ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేసిందని కేశినేని నాని అన్నారు. దేశంలో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని ఆయన అన్నారు. అనంతరం కేంద్రమంత్రి పోఖ్రియాల్ తెలుగు భాష పరిరక్షణకు సంబంధించిన పలు విషయాలపై వివరణ ఇచ్చారు. మైసూరులోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (సీఐఐఎల్) అధీనంలో ఉన్న తెలుగు క్లాసికల్ అభివృద్ధి సంస్థను నెల్లూరుకు మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాంతీయ భాషలను పటిష్ఠం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని, ఇందుకోసం మైసూరులోని సంస్థను నెల్లూరుకు మార్చారని పోఖ్రియాల్ తెలిపారు. ఈ సంస్థ నవంబరు 13 నుంచి పనిచేయడం ప్రారంభించిందని వివరించారు. తెలుగు భాషపై ఇందులో చర్చలు, నిర్ణయాలు ఉంటాయని, అలాగే, సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేయడంపై అధికార,ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు,ఆరోపణలు చేసుకుంటున్నాయి.