హైదరాబాద్ : డేటా చోరీ వివాదంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. డేటా చోరీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్ కంపెనీలో పోలీసులు శనివారం అరవై హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఏడు హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. శనివారం నాటి సోదాల్లో కీలక సమాచారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని సిట్ ఇన్‌ఛార్జి స్టీఫెన్ రవీంద్ర విలేకరులకు తెలిపారు. అన్ని కంప్యూటర్లను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరిస్తున్నామన్నారు. తాము స్వాధీనం చేసుకున్న కీలక సమాచారాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపనున్నట్లు వెల్లడించారు. ఈ వివాదానికి సంబంధించి తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టి వేయాల్సిందిగా ఐటీ గ్రిడ్ అధిపతి అశోక్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేస్తామని ఆయన చెప్పారు.