హోసూరు : బెంగళూరులోని వర్తూరు ప్రాంతంలో పరిశ్రమల వ్యర్థపు నీటిని దక్షిణ పెన్నానదిలోకి వదలివేయడంతో కెలవరపల్లి డ్యాం నీరు పూర్తిగా కలుషిత మైంది. గత రెండు రోజులుగా బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాలలో వర్షాలు బాగా కురుస్తుండడంతో వ్యర్థపు నీరు దక్షిణ పెన్నాకు చేరింది. వర్షాల కారణంగా రోజుకు 800 క్యూసెక్కుల నీరు కెలవరపల్లి డ్యాంకు చేరుతున్నది. ఇదే అదనుగా బెంగళూరు శివారు ప్రాంతమైన వర్తూరు చుట్టుపక్కల ప్రాంతాలలో గల పరిశ్రమలు వ్యర్థపు నీటిని గుట్టు చప్పుడు కాకుండా దక్షిణ పెన్నాకు వదిలివేయడంతో ఆ నీరంతా కెలవరపల్లి డ్యాంకు చేరింది. డ్యాం నీరు కలుషితమై కాలువలకు విడుదల చేసిన నీటిలో నురగ పేరుకుపోయింది. దీనిని చూసి అవాక్కయిన అధికారులు కాలువల నీటిలో పేరుకు పోయిన నురగను తొలగించే దిశగా చర్యలు చేపట్టినా, వారి శ్రమ వృథా అయ్యింది.