పట్నా : జేడీయూ అధినేత నితీష్ కుమార్‌కు ఇదే చివరి ఎన్నికలని లోక్‌జన శక్తిపార్టీ (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. మంగళవారం రెండో దశ ఎన్నికలు జరుగుతున్నదశలో చిరాగ్ పాశ్వాన్ ట్వీట్‌లతో పాలక పక్షంపై విరుచుకు పడ్డారు. ‘నవంబర్ 10 తర్వాత నితీశ్ కుమార్ మరెన్నడూ ముఖ్యమంత్రి కారని లిఖితపూర్వకంగా రాసివ్వగలను. నితీష్ లేని బిహార్ కావాలి, గత 15 ఏళ్లలో రాష్ట్రం అపఖ్యాతి పాలై, దారుణమైన స్థితికి చేరుకుంది. వలసలు, నిరుద్యోగం, వరదలు వంటి పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల లేదు. ఉపాధ్యాయులు, విద్యార్ధులు చీకట్లో జీవిస్తున్నారు. బిహార్ నుంచి వలస వెళ్లిన వారు తమను తాము బిహారీ అని చెప్పుకోడానికి వెనకాడుతున్నారు. అయోధ్య రామ మందిరం కంటే పెద్దదైన సీత ఆలయాన్ని బిహార్‌లో నిర్మిస్తామని హామీ ఇస్తున్నా. బిహార్ ఫస్ట్- బిహారీ ఫస్ట్ అనేదే మా నినాదం’ అని అన్నారు.