దాదాపు 137 బిలియన్ అమెరికన్ డాలర్ల క్రిప్టోకరెన్సీకి చెందిన ఖాతాల పరిస్థితి అయోమయంగా మారింది. క్వాడ్రిగా-సీఎక్స్ అనే కెనడా క్రిప్టో కరెన్సీ కంపెనీ అధ్యక్షుడు జెరాల్డ్ కాటెన్ మరణించడంతో ఖాతాదారుల ఆందోళనకు గురవుతున్నారు. లావాదేవీలు జరపడానికి కావాల్సిన పాస్‌వర్డ్ ఎవరికీ తెలియకపోవడమే ఇందుకు అసలు కారణం. వివరాలు తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యారు. చేసేదిలేక కంపెనీ వర్గాలు కెనడా క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజిని సంప్రదించారు. రక్షణ కల్పించాలని వేడుకున్నారు. సానుకూలంగా స్పందించిన వారు రక్షణ కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. కాటెన్ తరఫున ఖాతాలను నిర్వహించడానికి అతని భార్య జెన్నీఫర్ రాబర్ట్‌సన్ పెట్టుకున్న అభ్యర్థనను నోవా స్కోటియా హైకోర్టు అంగీకరించింది. కాటెన్ వినియోగించిన కంప్యూటర్ పాస్‌వర్డ్ తెలియకపోవడంతో దాన్ని ఎవరూ వాడలేకపోతున్నామని.. దాదాపు 115,000 ఖాతాల వివరాలు దానిలో ఉన్నట్లు రాబర్ట్‌సన్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎంత వెతికినా ఇంట్లో పాస్‌వర్డ్‌కు చెందిన వివరాలు కూడా దొరకడం లేదని ఆమె తెలిపారు. అయితే ఈ రంగంలో నిపుణులైన వ్యక్తులు ఇరత కంప్యూటర్లు, కాటెన్ సెల్‌ఫోన్ నుంచి పాక్షిక సమాచారం రాబట్టారన్నారు. దీంతో ఇప్పటికైతే కొంత సొమ్మును గుర్తించగలిగారు. అయితే కాటెన్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని.. తనకు బెదిరింపులు సైతం వస్తున్నట్లు రాబర్ట్‌సన్ తెలిపారు. ఇండియాలో ఓ అనాథ ఆశ్రమంలో సేవా కార్యక్రమాల నిమిత్తం వచ్చిన జెరాల్డ్ కాటెన్ అనారోగ్యంతో గత నెలలో ఇక్కడే మృతి చెందినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.