హవానా: క్యూబా అధ్యక్షుడిగా మిగుయెల్ డియాజ్ కానెల్ బర్ముడెజ్ తిరిగి ఎన్నికయ్యారు. కొత్త రాజ్యాంగం ప్రకారం గురు వారం క్యూబన్ ప్రజాధికార జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) అసాధారణ సమావేశం జరిపి ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. గత ఏప్రిల్ నుంచి కొత్త రాజ్యాంగం అమలుల్లోకి వచ్చింది. రాజ్యాంగం ప్రకారం అక్టోబరు10న ఎన్నిక నిర్వహించారు. జాతీయ అసెంబ్లీలోని మొత్తం 580 మంది ప్రతినిధుల్లో 579 మంది కానెల్ను సమర్ధించారు. కానెల్కు 96.79 శాతం ఓట్లు లభించింది. ఈ పదవిలో 2023 వరకు ఉంటారు. దేశ పాలన, మంత్రి మండలి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఉపాధ్యక్షుడిగా సాల్వెడార్ వాల్డెస్ మెసా ఎన్నికయ్యారు. ఎస్టెబన్ లాజో జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడిగా కొనసాగుతారు. ప్రస్తుతం దేశాధ్యక్షుడిగా ఎన్నికైన కానెల్ డిసెంబర్లో ప్రధానిని నియమించనున్నారు. క్యూబా విప్లవ తార ఫైడల్ కాస్ట్రో అధ్యక్షునిగా ఉండగా 1956 నుండి 1976 వరకూ కొనసాగిన ప్రధాని పదవిని ఇప్పుడు పునరుద్ధరించటం గమనార్హం. ‘విప్లవం అంటే భవిష్యత్తు కోసం జరిగే పోరాటం. ఇది ఇక్కడితో ఆగేది కాదు. నిరంతరం కొనసాగుతుంది.’ కానెల్ ఈ సందర్భంగా చెప్పారు. మన ముందున్న మౌలిక కర్తవ్యం రక్షణ, ఆర్థిక వ్యవస్థలను మరింత బలోపేతమని ఉద్ఘాటించారు.