అమరావతి:‘ సాగునీటి పథకాల పనులకు రివర్స్ టెండరింగ్ అమలులోకి వస్తుందనగానే మీకు, మీ అధినేతకు వెన్నులో వణుకు పుడుతుందా ఉమా?’ అని వైకాపా నేత,రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గురువారం ట్వీట్లో ప్రశ్నించారు.‘పోలవరంలో మీరు దోచుకున్న ప్రతి రూపాయి కక్కిస్తాం. మీలాగా కుల, వర్గ బలహీనతలు సీఎం జగన్ గారికి లేవు. చూస్తారుగా తొందరెందుకు?’ అని హెచ్చరించారు. ‘అవినీతి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కు కొత్త పేరు ప్రతిష్టల్ని తీసుకొ స్తామని ముఖ్యమంత్రి చెబుతుంటే పచ్చ పార్టీ నేతలు పరిశ్రమలు రావంటున్నారు. గతంలో ఐటీ, ఈడీ దాడులు జరిగినపుడు ఇలాగే మాట్లాడారు. అవినీతిని వ్యవస్థీకృతం చేసిన చంద్రబాబు అది లేకుండా పనులెలా జరుగుతాయనడంలో వింతేమీ లేద’ని హేళన చేసారు. ‘ప్రజల వేళ్లపై పోలింగు రోజు వేసిన సిరా మరక ఇంకా చెరగనే లేదు. అప్పుడే గుండెలు బాదుకునే బృందం వీధుల్లోకి వచ్చింది. మంగళగిరి ప్రజలు పొర్లించి కొట్టిన మాలోకానికి కాస్త వేచి చూడాలన్న స్పృహ కూడా లేదు. అప్పుడే ఏడుపు లంకించుకున్నాడ’ని ఎగతాళి చేసారు.