న్యూ ఢిల్లీ : బిజెపి అధికారంలో ఉన్నంత కాలం ప్రజాస్వామ్యానికి ప్రమాదమేనని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే బిజెపి స్వభావమని సిపిఎం సమన్వయకర్త ప్రకాష్ కరత్ విమర్శించారు. సిపిఎం త్రిపుర రాష్ట్ర 24వ మహాసభ రవీంద్ర శతబర్షికి భవన్‌లో గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రవీంద్ర శతబర్షికి భవన్ ఎదుట సేవ్ త్రిపుర, బిజెపిని సాగనంపాలంటూ నినాదాల మధ్య భారీ ర్యాలీ, బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రకాష్ కరత్ మాట్లాడుతూ త్రిపుర రాజధాని అగర్తలలోని స్వామి వివేకానంద మైదానంలో సిపిఎం తలపెట్టిన ర్యాలీకి అనుమతి నిరాకరించడాన్ని ప్రజాస్వామ్య ఖూనీ అని అన్నారు. ‘బిజెపికి, దాని ప్రభుత్వానికి ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాము. మీరు మాపై ఎంతగా దాడి చేస్తే మేము అంతగా విజృంభిస్తాం. త్రిపురలో సిపిఎం అతి పెద్ద ప్రతిపక్ష పార్టీ. భారీ ప్రదర్శన నిర్వహించేందుకు పార్టీకి అనుమతివ్వలేదు. ఈ ఘటనతో త్రిపురలో ప్రజాస్వామ్యం ఏ స్థితిలో ఉన్నదో దేశం ముందు ఆవిష్కృతమైంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం బిజెపి డిఎన్‌ఎలో ఉంది’ అని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలనలో పార్లమెంటరీ పద్ధతులకు తిలోదకాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయని ప్రకాష్‌కరత్ విమర్శించారు. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సొరేన్ అరెస్టులను ఆయన ప్రస్తావిస్తూ ‘ప్రతిపక్షాల నాయకులను ఏ విధంగా జైలులో ఉంచారో మనం చూశాం. ఇప్పుడు ఢిల్లీలో శాసనసభ ఎన్నికలు జరగబోతు న్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్‌ను అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. దానికి ముందు జార్ఖండ్ ముఖ్యమంత్రి, జెఎంఎం నేత హేమంత్ సొరేన్‌ను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ప్రతిపక్షాలపై దాడి చేయడం, ఆ పార్టీల నేతలపై తప్పుడు కేసులు బనాయించడం, వారిని జైళ్లలో పెట్టడం బిజెపికి పరిపాటిగా మారింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్ష ప్రభుత్వాల పాలనలో త్రిపురలో మతపరమైన అల్లర్లేవీ జరగలేదని ప్రకాష్ కరత్ గుర్తు చేశారు. ఇప్పుడు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కుట్రల కారణంగా అలాంటి ఘటనలు చోటు చేసుకుంటు న్నాయని చెప్పారు. ‘దేశంలో హిందువులు, ముస్లిముల మధ్య ఉద్రిక్తతలను పెంచడానికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. బిజెపి అధికారంలో ఉన్నంత కాలం ప్రజాస్వామ్యానికి ప్రమాదమే అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు లౌకిక, ప్రజాతంత్ర శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరముంది’ అని నొక్కి చెప్పారు. దేశ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని మార్చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు. జమిలి ఎన్నికల బిల్లు అందులో భాగమేనని అన్నారు. 2018కి ముందు త్రిపురకు బిజెపి ఇచ్చిన అనేక హామీలు నేటికీ నెరవేర్చలేదని మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ విమర్శించారు. ఉపాధి హామీ పథకం కార్మికుల రోజువారీ వేతనాన్ని పెంచుతామని చెప్పి, ఆ మాటే మరిచారని అన్నారు. వామపక్ష ప్రభుత్వం సామాన్య ప్రజల అభివృద్ధికి ప్రాధాన్య తిచ్చిందని చెప్పారు. బిజెపి పాలనలో రాష్ట్రంలో అవినీతి పెచ్చరిల్లిందని, శాంతి భద్రతలు కనుమరుగయ్యాయని, రాజకీయ హింస, మహిళలపై నేరాలు పెరిగాయని తెలిపారు. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని, ఆగ్రహాన్ని సిపిఎం భారీ ర్యాలీ ప్రతిబింబించిందని అన్నారు.