న్యూఢిల్లీ : రాజ్యాంగ రూపశిల్పి బిఆర్ అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షా కేంద్ర హోంమంత్రి పదవికి అనర్హుడని, ఆయనను ఆ పదవి నుంచి సత్వరమే తొలగించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్‌ను కించపరుస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆయన బేషరతుగా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. పశ్చిమబెంగాల్, త్రిపుర, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, హర్యానా, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, గోవా, పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీ, పుదుచ్చేరితో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగాయి. ఈ సందర్భంగా వామపక్ష నేతలు మాట్లాడారు. అమిత్ షా వ్యాఖ్యలు భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా హిందుత్వ దాడిలో భాగమని స్పష్టం చేశారు. అమిత్ షాకు రక్షణగా ప్రధాని నరేంద్రమోడీ అనుసరిస్తున్న వైఖరి దారుణమన్నారు. ఈ విషయంలో ఎన్డీఏ పక్షాలు ఆలోచన చేయాలని తెలిపారు. సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐఎంఎల్ (లిబరేషన్), ఆర్‌ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు ఉమ్మడిగా ఇచ్చిన పిలుపునకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి అనురాగ్ సక్సేనా, ఇతర వామపక్ష నేతలు సిద్ధేశ్వర్ శుక్లా, అమర్జీత్ కౌర్, సుచేతాడే, ఆర్ ఎస్ దాగర్, ధర్మేంద్ర కుమార్ తదితరులు మాట్లాడారు. ఒడిశాలోని భువనేశ్వర్, కటక్, బెర్హంపూర్, జాజ్‌పూర్‌లో జరిగిన ఆందోళనల్లో వందలాది మంది పాల్గొన్నారు. హర్యానాలోని జిల్లా కేంద్రాల్లో నిరసనలు జరిగాయి. త్రిపురలో అగర్తల, బలోనియా, ఉదరుపూర్, కమలాపూర్‌లలో భారీ నిరసన ర్యాలీలు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లోని రారుగంజ్‌లో వామపక్ష పార్టీలు రోడ్డును దిగ్బంధించాయి.