అమరావతి : భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌పై రాజ్యసభలో అవమానకరమైన, అప్రతిష్టాకరమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. జాతీయ నిరసన దినంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఐ (ఎంఎల్) న్యూడెమొక్రసి నాయకులు వై.సాంబశివరావు, సిపిఐ (యంఎల్) నాయకులు జాస్తి కిషోర్‌బాబు, యంసిపిఐ (యు) నాయకులు కాటం నాగభూషణం, సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకులు ఎన్.మూర్తి, సిపిఐ (యంఎల్) న్యూడెమొక్రసి నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వరు, ఎస్‌యుసిఐ (సి) నాయకులు బిఎస్ అమర్‌నాథ్, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు పివి సుందరరామరాజు, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ నాయకులు జానకి రాములు బుధవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అంబేద్కర్‌ను అభిమానించే వారిని ఎగతాళి చేస్తూ, ‘అంబేద్కర్ జపం చేయడం ఫ్యాషన్‌గా మారిందని, అదే ఏదో ఒక దేవుడిని తలుచుకుంటూ జపం చేస్తే స్వర్గానికి వెళ్లే అవకాశం వస్తుందంటూ’ అమిత్‌షా చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికినా, నిరసనలు వెల్లువెత్తినా ప్రధాని మోడీ ఆయన్ను వెనకేసుకురావడం భారతీయులకు తలవంపని పేర్కొన్నారు. అన్ని తరగతులు, వర్గాల ప్రజానీకం, సామాజిక, ప్రజాసంఘాలు 30వ తేదీన జరిగే నిరసన కార్యక్రమాలకు మద్దతునిచ్చి, పాల్గొనాలని వామపక్షాలు విజ్ఞప్తి చేశాయి.