కార్పొరేట్‌ లాభాల కోసమే స్మార్ట్‌ మీటర్లు

కార్పొరేట్‌ లాభాల కోసమే స్మార్ట్‌ మీటర్లు

న్యూ ఢిల్లీ : కార్పొరేట్‌ లాభాల కోసమే స్మార్ట్‌ మీటర్లు తీసుకొస్తున్నారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. స్మార్ట్‌ మీటర్లతో ప్రజలపై పెనుభారం పడనుందన్నారు. బషీర్‌బాగ్‌ అమరవీరుల స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విద్యుత్‌ సంస్కరణలపై పోరాటాన్ని నిర్మించాలన్నారు. గురువారం నాడిక్కడ హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ భవన్‌లో బషీర్‌బాగ్‌ కాల్పుల ఘటన అమరులకు సిపిఎం నేతలు నివాళులర్పించారు. అమరవీరులు బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్థన్‌ రెడ్డి చిత్ర పటాలకు పూలమాలలు వేసి, వారి త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం బివి రాఘవులు మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు షరతుల ఒత్తిడితో ప్రజా వ్యతిరేక విద్యుత్‌ రంగ సంస్కరణలను విధించడానికి ప్రయత్నించిన చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ విద్యుత్‌ ఉద్యమం పెల్లుబుకిందని చెప్పారు. ప్రజల ప్రతిఘటనను అణచివేసే క్రమంలో బషీర్‌బాగ్‌లో కాల్పులకు పూనుకుని, తన క్రూరత్వాన్ని చంద్రబాబు ప్రభుత్వం చాటుకుందని గుర్తుచే శారు. నయా ఉదారవాద సంస్కరణలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన పెద్ద ప్రతిఘటనలో ఈ ఉద్యమం ఎలా భాగమైందో గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ రైతు ఉద్యమాన్ని సైతం వివరించారు. వ్యవసాయాన్ని కార్పొరేటీ కరణ చేసేందుకు తీసుకువచ్చిన చట్టాలను మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకునేలా చేసిన లక్షలాది మంది రైతుల పోరాటాలను ప్రశంసించారు. నేడు విద్యుత్‌ రంగంలో స్మార్ట్‌ మీటర్లను విధించడంతో కార్పొరేట్‌ ఆధారిత ఎజెండాను తిరిగి ప్రవేశపెడుతున్నారని, అందువల్ల ప్రజలపై మరింత భారం పడుతుందని వివరించారు. బషీర్‌ బాగ్‌ అమరవీరుల నుంచి స్ఫూర్తి పొందుతూ సామాజిక న్యాయం, విద్యుత్‌, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటాల్లో సిపిఎం తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని తెలిపారు. మాజీ ఎంపీ, సిపిఎం సీనియర్‌ నేత పి. మధు మాట్లాడుతూ ప్రజల హక్కుల పరిరక్షణలో అమరవీరుల త్యాగాన్ని గుర్తుచేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos