బాంబే హైకోర్టు వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకం

బాంబే హైకోర్టు వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకం

న్యూఢిల్లీ : బాంబే హైకోర్టు బెంచ్‌ రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. గాజాలో ఇజ్రాయిల్‌ మారణహోమానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి ముంబై పోలీసులు నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు ధర్మాసనం తిరస్కరిస్తూ చేసిన పరిశీలనలను సిపిఎం ఖండించింది. ఈ అంశంపై పొలిట్‌బ్యూరో విడుదల చేసిన ప్రకటన వివరాలిలా ఉన్నాయి. ఈ సందర్భంగా సిపిఎం దేశభక్తిని కోర్టు ప్రశ్నించడం సరికాదు. రాజ్యాంగంలోని నిబంధనల గురించి, రాజకీయ పార్టీల చట్టబద్ధమైన హక్కుల గురించి, మన దేశ చరిత్ర గురించి, పాలస్తీనాకు మన దేశ ప్రజల సంఘీభావం, మాతృభూమి కోసం ఉండే చట్టబద్ధమైన హక్కు గురించి బెంచ్‌కు తెలియనట్లు కనిపిస్తోంది. ధర్మాసనం పరిశీలనలు కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా రాజకీయ పక్షపాతాన్ని సూచిస్తున్నాయి. ‘పాలస్తీనా వైపు లేదా ఇజ్రాయిల్‌ వైపు వెళ్లాలనేది ఎంత గందరగోళానికి దారితీస్తుందో మీకు తెలియదు. మీరు ఎందుకు ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నారు? మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని బట్టి చూస్తే మీరు దేశ విదేశాంగ వ్యవహారాలకు ఏమి చేస్తున్నారో మీకు అర్థం కావడం లేదు’ అని బెంచ్‌ వ్యాఖ్యానించింది. ‘మీరు భారత దేశంలో నమోదైన సంస్థ. చెత్త పారవేయడం, కాలుష్యం, మురుగునీటి పారుదల లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఉదాహరణలు మాత్రమే మేము ఇస్తున్నాం. మీరు వాటిపై కాకుండా దేశం వెలుపల వేల మైళ్ల దూరంగా జరుగుతున్న దానిపై నిరసన తెలుపుతున్నారు’ అని ధర్మాసనం పేర్కొంది. గత శతాబ్దంలోని 1940లలో మహాత్మాగాంధీ జాతీయ ఉద్యమం, స్వతంత్ర భారతదేశం తదనంతర విదేశాంగ విధానం, పాలస్తీనా ప్రజల స్వేచ్ఛ, మాతృభూమి హక్కుకు మద్దతు ఇవ్వడంలో వెనుకాడలేదనే వాస్తవాన్ని ఈ పరిశీలనలు విస్మరిస్తున్నాయి. ఇజ్రాయిల్‌ చర్యకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఖండనలు, ఐక్యరాజ్య సమితి సంస్థలు, అంతర్జాతీయ న్యాయస్థానం తీసుకున్న వైఖరిని బెంచ్‌ గ్రహించలేదనే వాస్తవాన్ని ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. ఇటువంటి వైఖరిని ఖండించేందుకు, నిస్సందేహంగా తిరస్కరించేందుకు మాతో కలిసిరావాలని, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం’ అని సిపిఎం పొలిట్‌బ్యూరో పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos