ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాలను రద్దు చేయండి

ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాలను రద్దు చేయండి

న్యూఢిల్లీ : ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల (ఇఎల్‌ఐ) పేరిట కార్పొరేట్లకు భారీగా రాయితీలు ఇచ్చే పథకాని కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేయడాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. బడా కార్పొరేట్‌ సంస్థలకు ప్రజాధనాన్ని బదిలీ చేసేందుకే ఈ పథకం ఉద్దేశించారని తెలిపింది. కార్మికులను పణంగా పెట్టి కార్పొరేట్లకు లబ్ది చేకూర్చేందుకు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన మరో ప్రయత్నంగా ఈ పథకాన్ని పేర్కొంది.ప్రభుత్వ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి మరో ఉదాహరణగా ఈ పథకాన్ని ప్రారంభించింది. యువతను మోసం చేసేందుకు ఉద్యోగ అవకాశాల కల్పన, ఉపాధి పొందే సామర్ధ్యాలను పెంపొందించడం, సామాజిక భద్రత కల్పించడం వంటి హామీల ముసుగులో కార్పొరేట్లకు ప్రభుత్వ నిధులను బదిలీ చేసేందుకు ఈ పథకాన్ని ఉద్ధేశించారని వివరించింది. పెట్టుబడుల వ్యయానికి, ఉత్పత్తి వ్యయాలకు, కార్మిక ఖర్చులకు దేశీయ, విదేశీ యజమానుల చట్టబద్ధమైన రుణాలకు ప్రభుత్వ ఖజానా నుండి సబ్సిడీ మొత్తాన్ని అందించడమే ఈ పథకం లక్ష్యమని సిపిఎం తెలిపింది. ‘గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు లబ్ది చేకూర్చే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) కు కేటాయింపులను బిజెపి ప్రభుత్వం తగ్గిస్తోంది. పట్టణ ప్రాంతాలకు కూడా ఇటువంటి ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించాలనే డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు. అదే సమయంలో, కార్పొరేట్లకు మాత్రం ప్రోత్సాహకాల పేరుతో పెద్ద మొత్తంలో రాయితీలు అందచేస్తోంది’ అని పేర్కొంది. పెద్ద సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయడం ద్వారా కనీస వేతనాలు, ఉపాధి భద్రత, సామాజిక భద్రతలతో ఉపాధికి హామీ కల్పిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. అలాగే కార్పొరేట్‌ వర్గానికి సబ్సిడీలు ఇవ్వడానికి బదులుగా తగిన మొత్తంలో నిధులు కేటాయించి ఆరోగ్యం, విద్య, ప్రజా రవాణా, తదితర ప్రజా సేవలను విస్తరించాలని కోరింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos