కరోనా కట్టడిలో మోడీ సర్కారు విఫలం

కరోనా కట్టడిలో మోడీ సర్కారు విఫలం

హైదరాబాద్:దేశ వ్యాప్తంగా కొవిడ్ రెండో దాడికి భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు విమర్శించారు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘మరో రెండు నెలలపాటు కోవిడ్ మహమ్మారి ఉధృతి ఉంటుంది. దీన్ని ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైంది. మొదటి దశలో లాక్డౌన్ పెట్టి వైరస్ నిలువరించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని గొప్పలు చెప్పుకున్న మోదీ ప్రభుత్వం రెండో దశ కోవిడ్ విపత్తును మరిచి పోయింది. వైరస్ రెండో దశ సహజ సిద్ధంగా వచ్చింది కాదు. కేంద్రం చర్యలే ప్రధాన కారణం. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు, ఇసి, బిజెపి వ్యవహరించిన తీరు ఈ వ్యాప్తికి మరింత దోహదం చేశాయి. మొదటి దశ నుంచి కేంద్ర ప్రభుత్వం గుణపాఠాలను నేర్చుకోలేదు. ఆక్సిజన్ను ఉత్పత్తి సరఫరా చేయడంలో ఘోరంగా విఫల మైంది. రాష్ట్రాలపై నిందమోపే పనిలో ఉంది. విజయం సాధిస్తే కేంద్రానిది, విఫలమైతే రాష్ట్రాలది తప్పు అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోంది. ఆక్సిజన్ ఉత్పతి, రవాణా, ప్లాంట్ల ఏర్పాటు వంటి అన్నింటికీ మోడీదే బాధ్యత. కరోనా టీకా విషయంలో కేంద్రం మోసపూరిత విధానం బట్టబయలైంది. అందరికీ ఉచితంగా టీకాలు ఇవ్వాల్సిన తరుణంలో రాష్ట్రాలకు ఎక్కువ ధర, ప్రయివేటు ఆస్పత్రులకు మరింత ఎక్కువ ధరకు అమ్మడం ఏంటి? అన్ని వైపుల నుంచీ విమర్శలు వస్తోన్నా వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేదు. అమెరికాతో స్నేహంగా వ్యవహరిస్తోన్న మోడీ… ఆ దేశం నుంచి వ్యాక్సిన్ ముడి సరుకు తెప్పించడంలో విఫలమయ్యారు. పంచవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో సడలింపులిచ్చినట్లు నటిస్తోంది. ఇప్పటికైనా కేంద్రం కోవిడ్ కోసం కేటాయించిన రూ.35 వేల కోట్లు, పిఎం కేర్ ఫండ్ను రాష్ట్ర ప్రభు త్వాలకు కేటాయించాలి. కోవిడ్ కట్టడికి ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos