మందు తాగి వాహనాలు నడపకండిరా బాబు అంటూ పోలీసులు ఎంత సున్నితంగా చెబుతున్నా మందుబాబులు మాత్రం మాట వినడం లేదు.జరిమానాలు వేసినా,వాహనాలు సీజ్ చేసినా ఏంచేసినా మందుబాబుల తీరు మాత్రం మారడం లేదు కదా రోజురోజుకు మితిమీరుతోంది.మందుబాబులే కాదు మందుభామలు కూడా పీకలదాక తాగి పోలీసులకు,ప్రజలకు చుక్కలు చూపిస్తున్న ఘటనలు ప్రతీవారం చూస్తునేఉన్నాం.ఎన్నిసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసినా జరిమానాలు విధించినా మందుబాబులు మారరని తెలుసుకున్న పోలీసులు,కోర్టులు కఠినచర్యల బాట పట్టారు.ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ వ్యక్తికి లైసెన్స్ రద్దు చేయడంతో పాటు 20 రోజుల జైలు శిక్ష విధించింది.గురువారం రాత్రి గాజులరామారం సర్కిల్లో పరిధి సూరారం ప్రాంతానికి చెందిన లాల్ మహ్మద్ అనే వ్యక్తి జీడిమెట్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. గతంలో కూడా లాల్ మహ్మద్ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డట్లు గుర్తించిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి మేడ్చల్లోని 7వ ప్రత్యేక రెండవ తరగతి మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా లైసెన్స్ రద్దు చేయడంతో పాటు 20 రోజుల జైలుశిక్ష విధించింది. జైలు శిక్ష విధించడం మామూలే అయినా లైసెన్స్ రద్దు కావడం మాత్రం రాష్ట్రంలో ఇదే మొదటిసారని పోలీసులు చెబుతున్నారు.