తెలంగాణ రాష్ట్రంలో
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. తెరాసలోకి వలస వెళ్లడానికి కాంగ్రెస్
ఎమ్మెల్యేల ఆతృత గమనిస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ అతిత్వరలోనే దుకాణం కట్టేయడం తథ్యంగా
కనిపిస్తోంది.ఇప్పటికే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరనున్నట్లు ప్రకటించగా
తాజాగా ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడా తెరాసలో చేరనున్నట్లు
అధికారికంగా ప్రకటించాడు.తాజాగా తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలుసుకున్న
జాజుల సురేందర్ తన ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటూ అది కేవలం ఒక్క కేసీఆర్‌తోనే
సాధ్యమవుతుందని తెలిపాడు.నియోజకవర్గ ప్రజలు,కార్యకర్తల అభిప్రాయం మేరకే తెరాసలో చేరడానికి
నిర్ణయించుకున్నట్లు సురేందర్ తెలిపాడు.కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం లేదని
అందుకే తెరాసలో చేరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నిర్ణయించుకున్నామన్నారు.అందుకే
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా
చేసి తిరిగి పోటీ చేస్తానంటూ ప్రకటించాడు.ఇక సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల
ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఎంతో లబ్ది చేకూరుతోందని కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు
పథకం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందన్నారు.త్వరలో కేటీఆర్ సమక్షంలో తెరాసలో చేరనున్నట్లు
జాజుల సురేందర్ ప్రకటించాడు..