చెన్నై: తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలని గట్టి పట్టుదలగా ఉన్న భారతీయ జనతాపార్టీ ఇందుకోసం పావులు కదుపుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకేతో కలిసి బరిలోకి దిగాలని భావిస్తోంది. కలిసి వెళ్లడం దాదాపు ఖాయమైనప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో మాత్రం ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. సీఎం అభ్యర్థిని అధిష్ఠానం నిర్ణయిస్తుందని బీజేపీ తమిళనాడు చీఫ్ మురుగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకేలో కాక రేపాయి. అన్నాడీఎంకే వర్గాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించడంతో మురుగన్ వెనక్కి తగ్గారు.
తాజాగా, పళనిస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేవకర్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమను నిర్దేశించాలని చూస్తే బీజేపీతో పొత్తు ఉండదని స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికల్లో పళనిస్వామే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని తేల్చి చెప్పింది. కూటమికి అన్నాడీఎంకేనే సారథ్యం వహిస్తుందని ఆ పార్టీ నేత, ఎంపీ కేపీ మునుస్వామి పునరుద్ఘాటించారు. ఏదైనా జాతీయ పార్టీ తమను డిక్టేట్ చేయాలనుకుంటే కనుక ఆహ్వానించబోమని ఆయన స్పష్టంగా చెప్పారు.