తిరుమల తిరుపతి దేవస్థానములకు చెందిన పలు ఆస్తులను విక్రయించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు పెరుగుతున్నాయి.తెలుగుదేశంతో పాటు కాంగ్రెస్,బీజేపీ నేతలు జగన్ సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.హిందూ సంఘాలు సైతం జగన్ నిర్ణయంపై మండిపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న టీటీడీ ఆస్తులను విక్రయించే అధికారం జగన్ సర్కార్కు లేదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. హిందూ ధర్మం, హిందూవుల ఆలయాలను, కోట్లాది మంది భక్తుల మనోభావాలను కించపరిచే విధంగా ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులపై పెట్టుకున్న వారు బతికి బయడపడిన దాఖలాలు లేవని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇలాంటి హిందూవుల వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే వారిని దేశం నుంచి తరమికొట్టే రోజులు వస్తాయన్నారు. టీటీడీ ఆస్తుల ఆమ్మకంతో వచ్చిన ఆదాయాన్ని చర్చిల నిర్మాణానికి, పాస్టర్ల జీతాలకు ఇతరత్రా సదుపాయాలకు వాడుకోవాలనుకోవడం తగదన్నారు. ఈ సందర్బంగా ఆదివారం నాడు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా టీటీడీ ఆస్తులను అమ్మాలనుకునే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాగే ఏపీ ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తే శ్రీవారి భక్తులతో పాటు హిందూవులను ఏకం చేసి ప్రజా పోరాటానికైనా సంఘటితంగా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా బండి సంజయ్ ఘాటైన హెచ్చరికలు చేశారు. టీటీడీ ఆస్తులు అమ్మే హక్కు మీకెక్కడిది అంటూ ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సర్కారుపై మండిపడ్డారు. శ్రీవారికి భక్తులు ఇచ్చిన ఆస్తిని నిర్వహించడానికి మాత్రమే మీకు హక్కు ఉంది. అలాంటిది మీరెలా వేలం వేస్తారు? అంటూ ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే దీని వెనుక హిందుత్వాన్ని అణగదొక్కే కుట్ర దాగివుందనే అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిపై రాజీలేని పోరాటం చేస్తామని కన్నా స్పష్టం చేశారు.ఇదే విషయంపై స్పందించిన కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ.. జగన్ సర్కార్ విమర్శలు గుప్పించారు. హిందూ దేవాలయాల ఆస్తులు అమ్మకానికి పెట్టటం హిందువులను అవమానించటమే అని అన్నారు. మీ స్వార్ధ ప్రయోజనాల కోసం, మీ బినామీలకు కట్టబెట్టటం కోసం ఇదో కొత్త ఎత్తుగడ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ఆస్తులు అమ్మకానికి పెట్టటం చేతకాని తనమని, అంత చేతగాని వారు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి , పాలక మండలి సభ్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మ పరిరక్షకులు అని ప్రచారం చేసుకునే స్వరూపానంద స్వామి, చిన్నజీయర్ స్వామీ ఇతర పీఠాధిపతులు ఏమయ్యారు? మీరు కూడా ప్రశ్నించటానికి భయపడుతున్నారా? అని నిలదీశారు. హిందూ ధర్మాన్ని కాపాడేది మేమే అని ప్రగాల్భాలు పలికే బీజేపీ, విశ్వ హిందూపరిషత్ పెద్దలు మొద్దునిద్ర పోతున్నారా? అని ప్రశ్నించారు. టీటీడీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొవాలని పద్మశ్రీ డిమాండ్ చేశారు. జనసేన నేత నాగబాబు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఏడు కొండల వాడా వెంకట రమణా.. గోవిందా గోవిందా. ప్రజలతో పాటు నీ ఆస్తులు కూడా రక్షించుకో స్వామి‘ అని ట్వీట్ చేశారు.కొన్ని రోజులుగా నాగబాబు పలు అంశాలపై స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా, ఆస్తులు వేలం వేయాలనుకుంటున్న టీటీడీ చర్యలను ప్రతిపక్ష నేతలంతా తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు.
ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవిందా,,ప్రజలతో పాటు నీ ఆస్తులు కూడా రక్షించుకో స్వామి.
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 24, 2020