హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు కరోనా బారిన పడ్డారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. అయితే వ్యాధి లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్లు తెలిపారు. స్వీయ నియంత్రణలో ఉండాలని వైద్యులు ఆయనకు సూచించారని, ప్రస్తుతం ఆయన ఫామ్ హౌస్‌లో ఉన్నారని వెల్లడించారు. ప్రత్యేక వైద్యుల బృందం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
నాగార్జున సాగర్‌లో అలజడి
నాగార్జున సాగర్‌లో కరోనా వైరస్ పంజా విసిరింది. ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ రోజున మహమ్మారి వేగంగా విస్తరించింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల భగత్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరితో పాటు మరి కొందరు టీఆర్ఎస్ నాయకులు ఎంసీ. కోటిరెడ్డి, కడారి అంజయ్యలకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంతేకాక పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా కోవిడ్ బారిన పడినట్లు తెలిసింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఈ రోజు 160 కరోనా కేసులు నమోదయ్యాయి.